
రామోజీరావు 'ఈనాడు' దినపత్రిక ద్వారా మరో పోరాటానికి సిద్ధమయ్యారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో వున్న కాంగ్రెస్ ప్రభుత్వాలపైనే ఆయన తన బాణాన్ని ఎక్కుపెట్టారు. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని 'ఈనాడు ముందడుగు' అనే శీర్షికను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక ప్రత్యేక వ్యాసాన్ని ప్రచురించారు. అందులోని ముఖ్యాంశాలు.."కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని అమల్లోకి తెచ్చి రెండున్నరేళ్లు దాటింది. అరవయ్యేళ్ల స్వతంత్ర భారత చరిత్రలోనే విప్లవాత్మక చట్టం తెచ్చిన ఘనత తమ సొంతమని సంకీర్ణ సారథులు లేని గొప్పలు చెప్పుకోవచ్చుగాక, ఆచరణలో దాన్నెలా నీరు గారుస్తున్నారో అడుగడుగునా తేట పడుతూనే వుంది... యేటా రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా లంచాల మేత సాగుతున్నదంటే, సర్కారీ అవినీతి ఎంతగా 'చట్టబద్ధమైందో' బోధపడుతుంది.. శాసన వ్యవస్థ చేసే ఏ చట్టమైనా ప్రజల కోసమే అంటున్నప్పుడు, ఏ నిబంధనల అమలుకైనా ప్రజా ప్రయోజనాలే పరమావధి అయినప్పుడు పాలనలో అసలు దాపరికమెందుకు? దశాబ్దాలుగా ఈ దాపరికమే అవినీతికి ఎరువుగా మారింది. తమను ఎవరూ గమనించడం లేదన్నప్పుడే నేరగాళ్లు రెచ్చిపోతారు. అవినీతిపరులు అభినవ బకాసురులవుతారు. ప్రజల రోజువారీ అవసరాలు తీర్చే ప్రభుత్వ కార్యాలయాల్లో 'చిలక్కొట్టుడు' అవినీతి ఒక రకం. అస్మదీయుల కోసం చట్టాల్నే చాపచుట్టేసి ఏకమొత్తంగా ప్రజాధనాన్ని లూటీచేసే జగజ్జెట్టీల అర్థిక నేరాలు మరోరకం. పాలనలో అవినీతి అన్ని విభాగాలకూ పాకిపోయి జన జీవనాన్ని దుర్భరం చేస్తున్నవేళ.. ఇంకా ఓపిక పట్టడం కాదు; సమాచార హక్కు చట్టంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్నే ఓ పట్టు పట్టాలి. అవినీతి రహిత పాలన మన హక్కు. పదకొండో ప్రణాళికలో ఖర్చు చేయాలనుకుంటున్న మొత్తం దాదాపు రు. 36 లక్షల కోట్లు. ఈ సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ లక్ష కోట్ల రూపాయల పైచులుకు! అదంతా ఎవడబ్బ సొమ్ము?.. వల్లించేది ప్రజాశ్రేయం, వెచ్చించేది ప్రజాధనం అయినప్పుడు ప్రభుత్వం ఆ డబ్బును ఎలా ఖర్చు చేస్తోందన్న సమాచారం ప్రజలకు తెలీకుండా తొక్కిపట్టడం ప్రజాద్రోహం.. దేవాలయ భూముల బాగోతం మొదలు డిపెప్ కుంభకోణం దాకా పత్రికలే వెలుగులోకి తెస్తుంటే, వాటిపైనా సంకుచిత రాజకీయ ముద్రలేసి తప్పించుకోజూస్తున్న తెంపరితనం పాలకులది. దొంగే 'దొంగా దొంగా' అంటూ ఎదురుదాడికి దిగుతున్నవేళ సమాచార హక్కు చట్టంతో ప్రజలే అవినీతి బాసుల ముసుగులు తొలగించే మహోద్యమ వీరులు కావాలి. తెలుగు గడ్డమీద అవినీతి రహిత మహోదయం కోసం తెలుగువాడి పక్షాన 'ఈనాడు' తన అక్షర అక్షౌహిణులను మోహరిస్తోంది. ప్రభుత్వ విభాగాల్లో అవినీతి చీడను చిదిమేసే లక్ష్యంతో, మడమతిప్పని మహోద్యమ నిర్మాణానికి 'ఈనాడు ముందడుగు' పేరిట ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసింది. సమాచార హక్కును రాష్ట్ర ప్రజలందరి వజ్రాయుధంగా మలచడమే 'ఈనాడు ముందడుగు' పని. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సమాచార హక్కును అరిభంజక కరవాలంగా ఝళిపించాలి. ఏ స్థాయిలో వున్నా అవినీతిని గురితప్పక ఖండించాలి. ఈ మహా క్రతువులో 'ఈనాడు ముందడుగు' రాష్ట్ర ప్రజలందరికీ అన్ని అంచెల్లోనూ చేదోడు వాదోడుగా వుంటుంది. సమాచార హక్కుపై జన జాగృతికోసం పత్రికలో 'ఈనాడు ముందడుగు' ప్రత్యేక పేజీలు కేటాయించడమే కాదు, జిల్లా స్థాయిలో సమాచార సారథుల్నీ నియమిస్తోంది. అవినీతిపై పోరులో ప్రజలందరికీ మార్గదర్శనం చేయడం వీరిపని. సమాచారం కోరే దరఖాస్తు ఫారాల్ని ముద్రించి అడిగినవారందరికీ ఉచితంగా అందివ్వడమే కాదు, వారి ఆశయ సాధనకు 'ఈనాడు ముందడుగు' తోడుగా నిలుస్తుంది. తమ నోటి దగ్గర ముద్దను కబళిస్తున్న అవినీతి గద్దలను ఎలా ఎదుర్కోవాలో తెలీని కోట్లాది ప్రజలకు అండగా రాష్ట్ర విశాల హితం కోరి 'ఈనాడు ముందడుగు' మోగిస్తున్న కదన కాహళి ఇది. అవినీతి భరతం పట్టేందుకు చట్టబద్ధంగా సాగే పోరు ఇది. బాధ్యతగల పౌరులూ, స్వచ్ఛంద సంస్థలూ ఉద్యమ స్ఫూర్తితో భాగస్వాములైతే నీతి నిలుస్తుంది. తెలుగుజాతి గెలుస్తుంది. సమాచార హక్కే మన ఆయుధం. అవినీతి అంతానికి పోరాడదాం"
No comments:
Post a Comment